ప్రాంతీయం

ఇదిగో మా రక్తం తీసుకో… మా రైతుల పొలాల్లో నీళ్లు పారించు సీఎం

7 Views

ఇదిగో మా రక్తం తీసుకో… మా రైతుల పొలాల్లో నీళ్లు పారించు సీఎం.

– రక్తదానం చేస్తూ భావోద్వేగానికి గురైన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్..
– రైతుల నీరు అందించేందుకు కంటతడి

కరీంనగర్ జిల్లా న్యూస్ ప్రతినిధి :- “మా రక్తం కావాలంటే తీసుకోండి… కానీ మా రైతుల ప్రాణాలు కాపాడండి… గోదావరి నీళ్లు సముద్రంలో కలవకుండా పొలాలకు చేరేలా చేయండి…” అంటూ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రక్తదాన శిబిరంలో భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతు బాధను రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు, సాగునీటి అంశాలపై తెలంగాణలో రాజకీయ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“మా రక్తం తీసుకోండి… కానీ రైతుల రక్తం, చెమట వృథా కాకుండా చూడండి. పంటలు ఎండిపోకుండా నీళ్లు ఇవ్వండి. రైతు కన్నీరు తుడవండి. ఇదే మా విజ్ఞప్తి” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరతపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని పేర్కొంటూ, ఇలాంటి సమయంలో రాజకీయ ఆరోపణలు కాకుండా రైతులకు నీరు అందించే చర్యలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సాగునీటి విస్తరణ, రైతు సంక్షేమ పథకాలు తెలంగాణ వ్యవసాయ రంగానికి బలాన్ని ఇచ్చాయని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం రైతులు మళ్లీ నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు.

“రైతు బతికితేనే తెలంగాణ బతుకుతుంది. గోదావరి నీళ్లు కళ్ల ముందే సముద్రంలో కలుస్తుంటే రైతు పొలాలు ఎండిపోవడం మనందరికీ బాధ కలిగించాలి. రైతు ప్రాణాల కంటే గొప్ప రాజకీయాలు ఏవీ కావు” అని అన్నారు.

ప్రభుత్వం వెంటనే సాగునీటి సమస్యపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి నిర్వహణపై దృష్టి పెట్టాలని కోరారు. కరువు పరిస్థితులు మరింత తీవ్రం కాకముందే రైతులకు అండగా నిలవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

“మా రక్తం కావాలంటే ఇస్తాం… కానీ మా రైతుల ప్రాణాలు కాపాడండి. వారి పొలాల్లో పచ్చదనం చూడటమే మా కోరిక. రైతు నవ్వితేనే తెలంగాణ నవ్వుతుంది” అంటూ సుంకె రవిశంకర్ భావోద్వేగంగా వ్యాఖ్యలు చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *