*రామగుండం పోలీస్ కమిషనరేట్*
*నీట్ పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ*
రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల పట్టణంలో ఈరోజు నిర్వహించిన నీట్ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ఐదు పరీక్షా కేంద్రాలను మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు ఇతర పరీక్షా కేంద్రాలను సందర్శించిన ఆయన, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది, అధికారులకు పలు సూచనలు,ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, మంచిర్యాల పట్టణంలోని మొత్తం ఐదు పరీక్షా కేంద్రాల్లో 1,204 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలకు హాజరయ్యేలా ఉదయం 11 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నామని చెప్పారు.
పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించి, ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా నిషేధిత వస్తువులు లోపలికి తీసుకెళ్లకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు.పరీక్షల నిర్వహణలో పాల్గొంటున్న సిబ్బందిని కూడా పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన అనంతరమే కేంద్రాల్లోకి అనుమతిస్తున్నామని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడంతో పాటు సీఆర్పీఎఫ్, స్థానిక ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు బలగాలు, సివిల్ పోలీసులతో ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు ప్రభుత్వ బస్సు సౌకర్యాలతో పాటు రైల్వే స్టేషన్,బస్ స్టాండ్ ప్రాంతాల్లో ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అవసరమైన చోట్ల పోలీసు వాహనాలను కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు.
మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని, అనంతరం ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు.పరీక్షలు ముగిసిన అనంతరం పరీక్షా సామగ్రిని సీఆర్పీఎఫ్,స్థానిక పోలీసుల భద్రత మధ్య సంబంధిత అధికారులకు తరలిస్తామని పేర్కొన్నారు.ప్రస్తుతం అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని,విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌రావు తదితరులు పాల్గొన్నారు.





