*రామగుండం పోలీస్ కమిషనరేట్*
రామగుండం కమిషనరేట్‌లో డ్రగ్ కంట్రోల్ ప్రత్యేక బృందాల ఏర్పాటు
గంజాయి,మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం: పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి,ఇతర మత్తు పదార్థాల రవాణా, సరఫరా,నిల్వ, విక్రయం, వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.
కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో సర్కిల్ వారీగా డ్రగ్ కంట్రోల్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కమిషనరేట్‌లో ఒక ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో రెండు యాంటీ నార్కోటిక్ బృందాలు పనిచేస్తుండగా, వాటికి అదనంగా సర్కిల్ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మత్తు పదార్థాల అక్రమ రవాణా మూలాలను గుర్తించడంతో పాటు, వాటి సరఫరా, వినియోగంపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఈ ప్రత్యేక బృందాలు గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచార సేకరణ, అనుమానాస్పద వ్యక్తులు,ప్రాంతాలపై నిఘా నిర్వహించడంతో పాటు,సమాచార దాతల వ్యవస్థ (ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్),ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రత్యేక దాడులు నిర్వహిస్తాయని పేర్కొన్నారు.రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల సరఫరా, రవాణా,నిల్వ, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే రామగుండం పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656597కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు సమాజ అభివృద్ధికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం గంజాయి,మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.





