ప్రాంతీయం

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

9 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త్యాగాల ఫలితం*

*అవినీతి,నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రజలకు 24/7 అందుబాటులో ఉండి సేవలు అందిస్తాం : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*

*రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*

ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గారు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. *ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలకు,కార్యాలయ అధికారులకు, సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు*.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మనందరికీ గర్వకారణమైన రోజు అని అన్నారు.ఈ రాష్ట్ర సాధన కోసం ఎందరో చేసిన త్యాగాలు, పోరాటాలు, అంకితభావం ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు.ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ,రాష్ట్ర సాధన వెనుక ఉన్న మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించబడిందని తెలిపారు. వ్యవసాయం,విద్య, వైద్యం,మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు తదితర రంగాల్లో రాష్ట్రం ముందడుగు వేసిందన్నారు.ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు సామాజిక సామరస్యం, శాంతిభద్రతలు కూడా బలోపేతమయ్యాయని పేర్కొన్నారు.రాష్ట్ర అభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని,ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తించి కష్టపడి పనిచేసినప్పుడే రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలు,అధికారులు, ఉద్యోగులు అందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసు శాఖ గత మూడు దశాబ్దాలుగా ఎంతో అంకితభావంతో పనిచేస్తోందన్నారు. ఒకప్పుడు సమస్యాత్మక ప్రాంతాలుగా భావించిన అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్నదని తెలిపారు.ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా పగలు,రాత్రి స్వేచ్ఛగా సంచరించే పరిస్థితులు ఏర్పడ్డాయని,ఇది పోలీసు శాఖ నిరంతర కృషి ఫలితమని పేర్కొన్నారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.అవినీతి, నిర్లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వకుండా పారదర్శకంగా విధులు నిర్వహిస్తామని చెప్పారు.ప్రజల భద్రత,సంక్షేమం కోసం 24/7 అందుబాటులో ఉంటూ సేవలందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు.విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన సేవా పతకాలను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ రమేష్,మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్,ఏవో శ్రీనివాస్,ఇన్‌స్పెక్టర్లు, సీఐలు, వివిధ విభాగాల అధికారులు, ఎస్‌ఐలు,సిబ్బంది, సీపీఓ సిబ్బంది, స్పెషల్ పార్టీ మరియు ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *