సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వీరనగర్ గ్రామ రైతులు ఐకేపీ ద్వారా వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం గజ్వేల్–చేగుంట ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. రైతులు రోడ్డుపై బైఠాయించి సుమారు మూడు గంటల పాటు ధర్నా చేపట్టడంతో రహదారిపై వాహన రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. దారి పొడవునా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క లారీ కూడా రాకపోవడంతో కేంద్రంలో ధాన్యం కుప్పలు తిప్పలుగా పేరుకుపోయిందన్నారు. పలుమార్లు ఐకేపీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతోనే తాము రోడ్డెక్కి నిరసన చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. వీరనగర్ స్టేజ్ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న తొగుట సిఐ లతీఫ్ ఫోన్ ద్వారా రైతులతో మాట్లాడారు. సంబంధిత శాఖ అధికారులతో చర్చించి వెంటనే లారీలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సిఐ హామీతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





