మంచిర్యాల జిల్లా
వరి ధాన్యం కొనుగోలుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా ఏప్రిల్ 22, 2026:
వరి ధాన్యం కొనుగోలుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, జిల్లా మార్కెటింగ్ అధికారి షహబుద్దీన్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిర్ణీత మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతుల సౌకర్యార్థం త్రాగునీరు, నీడ, మూత్రశాలలు, విద్యుత్, టేబుల్, కుర్చీలు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు ఏర్పాటు చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రములో ఖచ్చితముగా ఎలక్ట్రానిక్ తూకం పరికరాలు, టార్పాలిన్లు, ప్యాడి క్లీనర్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లాలో కేటాయించిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం సరఫరా చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు సమయంలో ఇతర కేంద్రాల నుండి తీసుకొన్న/పంపిన గోనె సంచుల వివరాలు జాగ్రతగా నమోదు చేసుకొని, ఆ వివరాలను రికాన్సిలేషన్ సమయములో సమర్పించాలని, ప్రతి రోజు కొనుగోలు కేంద్రాల వారీగా ధాన్యం కొనుగోలు సమాచారం, రైస్ మిల్లుకు పంపిన ధాన్యం వివరాలు అందించాలని తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా అవగాహన కల్పించాలని, పప్పు ధాన్యాలు, కూరగాయలు పండించేలా ప్రోత్సాహం అందించాలని తెలిపారు. వ్యవసాయ శాఖ, వ్యవసాయ విస్తరణ అధికారులు పంటల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని, పరిధాన్యం కొనుగోలు, రైస్ మిల్లులకు తరలింపు సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టమైన వివరాల నమోదుతో ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





