రామగుండం పోలీస్ కమిషనరేట్
రహదారి భద్రత నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో రహదారి భద్రతపై సమిష్టి కృషి
క్రమశిక్షణతోనే ప్రమాదాల నివారణ సాధ్యం: మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్
వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్,ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమానికి డీసీపీ ఏ.భాస్కర్, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,మంచిర్యాల ఏసీపీ ప్రకాష్,జిల్లా రవాణా అధికారి, హాజీపూర్ మండల తహసీల్దార్ పుష్పలత తదితరులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ప్రతి వాహనదారుడు జాగ్రత్తగా వాహనం నడిపి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు.రోడ్డు ప్రమాదం అనేది ఒక కుటుంబానికి జరిగే పెద్ద నష్టం అని పేర్కొన్నారు.
ప్రభుత్వం సురక్షిత ప్రయాణం కోసం రహదారులను నిర్మించినందున, వాటిని నిబంధనలకు లోబడి వినియోగించాలని తెలిపారు. రహదారులపై కేజ్ వీల్స్ నడపరాదని, నిబంధనలు ఉల్లంఘించి రహదారులకు నష్టం కలిగించే వాహనాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రతి వాహనానికి అవసరమైన పత్రాలు కలిగి ఉండాలని, మద్యం సేవించి లేదా మొబైల్ వినియోగిస్తూ వాహనం నడపరాదని సూచించారు. తనిఖీలలో మద్యం సేవించి వాహనం నడిపితే లైసెన్స్ సస్పెండ్ చేయబడుతుందని తెలిపారు.
18 సంవత్సరాల వయస్సు నిండని వారు వాహనాలు నడపరాదని,నడిపితే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.జాతీయ రహదారులపై వేగ పరిమితులను పాటించాలని,రవాణా వాహనాలు పరిమిత లోడుతోనే ప్రయాణించాలని సూచించారు.
పోలీస్, రవాణా శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యులై నిబంధనలు పాటించాలని తెలిపారు.అతివేగం ప్రమాదకరమని, అనుభవం ఉన్నా ప్రమాదం తప్పదని, వేగాన్ని నియంత్రించి నిబంధనలు పాటిస్తే సురక్షితంగా గమ్యానికి చేరుకోవచ్చని పేర్కొన్నారు.
మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ,ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,వెనుక కూర్చునేవారు కూడా హెల్మెట్ వినియోగించాలని సూచించారు.కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ధరించడం తప్పనిసరి అని తెలిపారు.పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లరాదని, వాహనం నడిపే సమయంలో మొబైల్ వినియోగించరాదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని తెలిపారు.చిన్న జాగ్రత్తలే ప్రాణాలను కాపాడతాయని పేర్కొన్నారు.గ్రామ సభల ద్వారా రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.ప్రమాద ప్రాంతాలను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామ రహదారులను శుభ్రంగా ఉంచి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
డీసీపీ మాట్లాడుతూ, గతంలో రహదారులు సరిగా లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని భావించేవారని, ప్రస్తుతం రహదారులు మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రమాదాలు మరియు మరణాల సంఖ్య పెరుగుతోందని తెలిపారు.దీనిపై చేసిన విశ్లేషణలో మౌలిక వసతులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించే వారిలో క్రమశిక్షణ,అవగాహన లోపమే ప్రధాన కారణమని పేర్కొన్నారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్,సీట్‌బెల్ట్ వినియోగం,వేగ పరిమితి పాటించడం అత్యవసరమని తెలిపారు.ఒకరు జాగ్రత్తగా ఉన్నా ఇతరుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. రహదారులు మన జీవితంలో ముఖ్యమైన భాగమని,కొందరి నిర్లక్ష్యం వల్ల నిరపరాధులు కూడా నష్టపోతారని అన్నారు.
ప్రస్తుతం అన్ని శాఖల సమన్వయంతో ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని తెలిపారు.రహదారి భద్రత పోలీస్ శాఖకే పరిమితం కాదని,ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ప్రమాద రహిత గ్రామాల నిర్మాణం కోసం గ్రామ రహదారి భద్రత కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీలలో సర్పంచ్ కన్వీనర్‌గా, స్థానిక పోలీస్ అధికారులు,ప్రస్తుత లేదా రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు సభ్యులుగా ఉంటారని వివరించారు.
ఈ కమిటీలు ప్రజల్లో అవగాహన పెంచి ప్రమాదాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్, స్ట్రాప్ వినియోగం, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ ధరించడం పర్యవేక్షిస్తాయని తెలిపారు.బైక్‌పై వెనుక కూర్చునేవారు కూడా హెల్మెట్ ధరించాలని,పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లేటప్పుడు కూడా హెల్మెట్ తప్పనిసరి చేయాలని సూచించారు.
ప్రమాదం క్షణాల్లోనే జరుగుతుందని, అందువల్ల హెల్మెట్ లేకుండా,సీట్‌బెల్ట్ లేకుండా,రాంగ్ డ్రైవింగ్,మద్యం సేవించి డ్రైవింగ్, అధిక వేగంతో ప్రయాణం చేయరాదని ప్రతిజ్ఞ చేసి పాటించాలని పిలుపునిచ్చారు.
ఆటో డ్రైవర్లు స్కూల్ పిల్లలను తీసుకెళ్లేటప్పుడు వారు తల్లిదండ్రుల ఆశలని గుర్తుంచుకోవాలని సూచించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటిస్తూ,ఎడమ వైపు నుంచి ఓవర్‌టేకింగ్ చేయకూడదని తెలిపారు. ఉప రహదారుల నుంచి ప్రధాన రహదారులపైకి వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఎడమ,కుడి వైపుల చూసి రావాలని సూచించారు.
ప్రతి నెల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కమిటీలతో సమావేశాలు నిర్వహించి రహదారి సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులు తమ అనుభవాలను పంచుకొని,రహదారి భద్రతా నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆటో, లారీ డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే, డీసీపీ మంచిర్యాల, జిల్లా కలెక్టర్,ఏసీపీ, సీఐ,ఎంఆర్‌ఓ, డీఎంఅండ్‌హెచ్‌ఓ, ఎంవీఐలు, ఎన్‌హెచ్-63 అధికారులు, కార్పొరేటర్లు, సర్పంచులు,వార్డ్ సభ్యులు, ఆశా వర్కర్లు,విద్యార్థులు మరియు సుమారు 500 మంది ప్రజలు పాల్గొన్నారు.





