ప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి , జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల ,ఏప్రిల్ 13, 2026:
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, ఇంచార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు లతో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కన్నేపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దుర్గం సంతోష్ తమ కుటుంబానికి తాతల నుండి వస్తున్న భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకున్నారని, ఈ విషయమై విచారించి అట్టి పట్టాను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. లక్షెట్టిపేట మండలం పోతపల్లి (అంకతపల్లి) గ్రామానికి చెందిన ఆపు నూరి రాయలింగు తనకు గ్రామ శివారులో గల భూమి రికార్డులలో పొరపాటు నమోదయిందని, సవరించి పట్టా మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కాజీపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన మెండ్రపు లక్ష్మి తన భర్తకు చెందిన భూమిని ఆయన మరణించిన తర్వాత తన భర్త తమ్ముడు అక్రమంగా పట్టా చేసుకొని ప్రభుత్వ లబ్ధి పొందుతున్నారని, ఈ విషయమై విచారించి తనకు రావలసిన వాటాను ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి మాజీ కో ఆప్షన్ సభ్యుడు అన్వర్ ఖాన్ తన దరఖాస్తులో బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డ్ స్థలం కబ్జా విషయంలో హైకోర్టు డిస్పోస్ ఆర్డర్ అమలు పరచాలని కోరారు. చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన అయిత రామ్ రెడ్డి పత్తి సాగు చేసుకుంటున్న తనకు చెందిన భూమి నూతన రికార్డు పుస్తకంలో నమోదు కాలేదని, నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. చెన్నూర్ మండల కేంద్రానికి చెందిన పిల్లల మర్రి సంధ్య తాను వికలాంగురాలు, వితంతువును అని తనకు ఇల్లు నిర్మించుకునేందుకు స్థలాన్ని కేటాయించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మందమరి మండలం అందుగులపేట గ్రామానికి చెందిన చాట్ల సుగుణ తనకు వంశపారంపర్యంగా వస్తున్న భూమిలో సంవత్సరం క్రితం ఇల్లు నిర్మించుకున్నానని, ఈ ఇంటికి నెంబర్, ఎన్.ఓ.సి. ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మందమర్రి మండలం ఊరు మందమర్రి గ్రామానికి చెందిన పల్లె మల్లేష్ ఉట్నూర్ ట్రైబల్ కోర్టులో కేసు కొనసాగుతున్న భూమికి సంబంధించి జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 60 దరఖాస్తులు అందాయని, అందిన ప్రతి దరఖాస్తుల క్షేత్రస్థాయిలో పరిశీలించి సమన్వయంతో పరిష్కరించే దిశగా కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





