సిద్దిపేట్ ఏప్రిల్ 13, తెలుగు న్యూస్ 24/7
కొండపాక మండలం దుద్దేడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి,ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 14న ప్రారంభమైన పదవతరగతి పరీక్షలు, ఎస్‌ఎస్‌సీ–2026 బోర్డు మార్గదర్శకాల మేరకు ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నాయని తెలిపారు. మిగిలిన పరీక్షలను కూడా ఇదే విధంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఏప్రిల్ 15, 16 తేదీల్లో నిర్వహించనున్న లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2 పరీక్షలతొ పదవతరగతి పరీక్షలు ముగిసిపోనున్నందున, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.పరీక్షా కేంద్రాలలో కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేయాలని, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా నిషేధించాలని, విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతె కేంద్రంలోకి అనుమతించాలని ఆదేశించారు. పరీక్షా గదుల్లో ఎలాంటి పుస్తకాలు, చార్ట్‌లు లేకుండా పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలని, ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తూ, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ ద్వారా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.






