సిద్దిపేట, ఏప్రిల్ 13, 2026
ఎండాకాలంలో వడదెబ్బ (హీట్ స్ట్రోక్) నుండి రక్షణ పొందేందుకు వైద్య ఆరోగ్య శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (ఐడీఓసీ) సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన అవగాహన గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ఎక్కువగా వీస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బ లక్షణాలైన తీవ్రమైన తలనొప్పి, నాలుక ఎండిపోవడం, నాడీ వేగంగా కొట్టుకోవడం, అధిక దాహం, శరీరంలో నీరు తగ్గిపోవడం, వాంతులు, విరోచనాలు, అపస్మారక స్థితి వంటి లక్షణాలు కనిపించిన వెంటనే బాధితుడిని నీడ ప్రదేశానికి తరలించి, చల్లటి నీటితో శరీరాన్ని తుడవాలని తెలిపారు. అందుబాటులో ఉన్న మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఇవ్వడం ద్వారా శరీరానికి తేమ అందించాలని, అనంతరం ఆలస్యం చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించాలని సూచించారు.ప్రజలు సాధ్యమైనంతవరకు ఉదయం, సాయంత్రం వేళల్లోనే పనులు నిర్వహించుకోవాలని, ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో బయట పని చేయడం నివారించాలని తెలిపారు. బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ, గొడుగు లేదా రుమాల్ ఉపయోగించడం మంచిదని, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే సమయంలో మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ వెంట తీసుకెళ్లాలని సూచించారు.పిల్లలు ఎండలో బయటకు వెళ్లడం, ఆడుకోవడం నివారించాలనీ, నీడ ప్రదేశాల్లోనే ఉండేలా చూడాలని తెలిపారు. ఆరు నెలల లోపు శిశువులకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు.కాటన్ దుస్తులు ధరించడం, ఎక్కువగా నీరు మరియు ద్రవపదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఇళ్లలో ఎండ, వడగాల్పులు లోనికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, వడదెబ్బ బాధితులకు తక్షణ ప్రథమ చికిత్స అందించాలని, అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. ధనరాజ్, డీఎఫ్ఓ పద్మజ రాణి, డీఆర్ఓ నాగరాజమ్మ, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సుభాష్ చంద్రబోస్ తదితర అధికారులు పాల్గొన్నారు..





