సిద్దిపేట, 13 ఏప్రిల్, తెలుగు న్యూస్ 24/7

కొండపాక మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హైమావతి సందర్శించి, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, పప్పు నాణ్యత సంతృప్తికరంగా లేకపోవడంతో వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరలను మొక్కుబడిగా కాకుండా నాణ్యతతో, రుచికరంగా వండాలని సూచిస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుతీసుకుంటామనిహెచ్చరించారు.అనంతరం స్టోర్‌రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్, నాణ్యమైన ఆహార పదార్థాలనే వినియోగించాలని, కాలం చెల్లిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని సంబంధిత ఎస్.ఓ.కు ఆదేశాలు జారీ చేశారు.పదవ తరగతి పరీక్షలు రాసి భోజనానికి వచ్చిన విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడి, పరీక్షలు ఎలా రాశారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు తాము పరీక్షలు బాగా రాశామని, ఇంటర్ విద్య కోసం కూడా కస్తూర్బాలోనే సీటు కోసం దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థినులకు భోజనం చేసేముందు ప్రార్థన చేయాలని, శుభ్రత పాటిస్తూ కడుపు నిండా భోజనం చేయాలని, మంచి క్రమశిక్షణ అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు.





