నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా,ఏప్రిల్ 2, 2026:
తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాలలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో మండల, జిల్లా స్థాయిలో అవగాహన శిబిరాలు నిర్వహించాలని, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఉపాధి అవకాశాల సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని, కార్యాలయాల నోటీసు బోర్డులలో ప్రదర్శించాలని తెలిపారు. జిల్లా పౌర సంబంధాల శాఖ ద్వారా దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని, విద్యాసంస్థల ప్రిన్సిపాల్ లు అర్హులైన విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు సమాచారం అందించాలని తెలిపారు. పలు దేశాలలో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను అర్హత గల మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జర్మనీ దేశంలో నర్సింగ్, ఎలక్ట్రికల్/పవర్ లైన్ టెక్నీషియన్ ఉద్యోగాలు, ఖతర్- దోహా దేశంలో నర్సింగ్ ఉద్యోగాలు, గ్రీస్ దేశంలో హాస్పిటాలిటీ, హౌస్ కీపింగ్, వెయిటర్లు, బార్బెండర్లు, వంట మనుషులు, హోటల్ రిసెప్షనిస్ట్, స్పా థెరపిస్టులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, లైఫ్ గార్డులు, గార్డెనర్లు, బెల్ బాయ్స్, ఫిషర్ మెన్ ఇతర ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఉద్యోగాల సంబంధిత విద్యార్హతలతో పాటు అభ్యర్థుల వయసు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం కలిగి ఉండాలని, 2, 3 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని, వసతి, ఆహారం, మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి అర్హత గల మైనారిటీ అభ్యర్థులు తమ బయోడేటా/సి వి ను వెంటనే tomcomglobal@gmail.com, tomcom.resume@gmail.com లకు మెయిల్ చేయవచ్చని, ఇతర వివరాలకు 9440048590, 9440049937, 9440051452, 8919047600 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





