లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత
మంచిర్యాల జిల్లా,మార్చి 18, 2026:
గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ ప్రక్రియ నియంత్రణ లింగ ఎంపిక నిషేధ చట్టం 1994 ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశానికి హాజరై జిల్లాలో పని చేస్తున్న స్కానింగ్ కేంద్రాలు, స్త్రీ వైద్య నిపుణుల దగ్గర ఉన్న స్కానింగ్ మిషన్ల ద్వారా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఉన్న స్కానింగ్ మిషన్ల ద్వారా అందిస్తున్న వైద్య సేవల పైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, అడగడం చట్టరీత్యా నేరమని తెలిపారు. భేటీ బచావో బేటి పడావో కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని, ఇందులో భాగంగా గర్భిణీల పర్యవేక్షణ, అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ల పర్యవేక్షణ, తనిఖీలు, రికార్డులు, సి సెక్షన్ ఆడిట్, తల్లులకు మహిళా సంఘాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం చేయాలని తెలిపారు. ప్రతి స్కానింగ్ సెంటర్ లో లింగ నిర్ధారణ పిసిపి యాంటీ యాక్ట్ పుస్తకము, స్కానింగ్ మిషన్ల వివరాలు ప్రదర్శించాలని, స్కానింగ్ కేంద్రంలో ఎలాంటి ఫోటోలు ఉండరాదని, స్కానింగ్ కు వచ్చే గర్భిణులకు సౌకర్యములు కల్పించాలని, లింగ నిర్ధారణ పైన అవగాహన కార్యక్రమాల గోడ ప్రతులను అతికించాలని, ఆసుపత్రి సర్టిఫికెట్లు, సేవల సంబంధిత రుసుముల వివరాలు గోడపై ప్రదర్శించాలని తెలిపారు. నూతన స్కానింగ్ మెషిన్ కొనడానికి ముందుగానే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని, పాత మిషన్ తీసివేయాలన్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుండి సర్టిఫికెట్ తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో బ్రూణ హత్యల నివారణకు కమిటీ సభ్యులందరూ సహకారం అందించాలని తెలిపారు. స్కానింగ్ కేంద్రాలను సందర్శించి లోపాలు ఉన్న వారికి మెమోలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరములలో లింగ నిర్ధారణ పరీక్షల పైన అవగాహన కార్యక్రమాల సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ డా. అరుణశ్రీ, డా. ప్రసాద్, డా. సుధాకర్, కమిటీ సభ్యులు డా. రాజ్ కిరణ్, రాంప్రసాద్, డా. ప్రశాంతి, సీనియర్ అసిస్టెంట్ హారిక, లింగారెడ్డి, లక్ష్మణస్వామి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, జిల్లా పౌర సంబంధాల శాఖ సిబ్బంది సంపత్, వైద్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





