సిద్దిపేట జిల్లా వర్గల్ మండల పరిధిలోని నాచారం గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని యధావిధి స్థానంలోనే ఏర్పాటు చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గ్రామ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో విగ్రహ స్థాపన కోసం ఏర్పాటు చేసిన సిమెంట్ పిల్లర్‌ను అర్ధరాత్రి సమయంలో తొలగించడాన్ని వారు ఖండించారు. గతంలో అంబేద్కర్ సంఘం నాయకులపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. విగ్రహాన్ని అదే స్థలంలో తిరిగి నిర్మించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుమ్మ శ్రీనివాస్, దళిత సంఘాల ఐకాస రాష్ట్ర కార్యదర్శి చిప్పల యాదగిరి, అల్మాల స్టూడెంట్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బండారు దేవేందర్, మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి అభినవ అంబేద్కర్ సంఘం బహిరం శివకుమార్, టీఆర్పీ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింగరావు, బీసీ సంఘం జిల్లా నాయకుడు బాకీ స్వామి, దళిత సంఘాల ఐకాస జిల్లా కార్యదర్శి నరేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్, గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు వెంకట్, స్వామి, గణేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.





