సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని చిన్న మసాన్ పల్లి బస్టాండ్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన గంగోల్ల కుంటయ్య (55), మహమ్మద్ ఖాజా (40) ద్విచక్ర వాహనంపై గజ్వేల్‌కు వెళ్తుండగా, ఎదురుగా కొత్తపల్లి గ్రామానికి చెందిన చుంచునకోట శ్రీకాంత్ రాయపోల్ వైపు వస్తుండగా రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న రాయపోల్ సర్పంచ్ మాసంపల్లి రాజు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంతేకాక ప్రైవేట్ వాహనంలో క్షతగాత్రులను గజ్వేల్ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. దౌల్తాబాద్ 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ భాను ప్రకాష్, పైలట్ డి.నర్సింలు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందిస్తూ గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.





