సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాంసాగర్ విద్యార్థిని కుమారి శ్రీనిధి రాష్ట్రస్థాయి భౌతిక శాస్త్ర ప్రతిభా పోటీల్లో తృతీయ బహుమతి సాధించి పాఠశాలకు కీర్తిని తీసుకొచ్చిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఫిజికల్ సైన్స్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గంగా ఆడిటోరియంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. తన ప్రతిభను చాటుతూ శ్రీనిధి రాష్ట్రస్థాయిలో మూడవ స్థానం సాధించింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థిని శ్రీనిధిని, గైడ్ టీచర్ నరేందర్ రెడ్డిని అభినందించారు. ఈ అరుదైన విజయంపై ఉపాధ్యాయులు యాదయ్య, నవీన్ కుమార్, మహేష్ కుమార్, శ్యామ్ సుందర్ శర్మ, మంజుల, సుజాత, ఉమారాణి, పీఈటీ అనీఫ్, సిఆర్పి స్వామి గౌడ్ తదితరులు అభినందనలు తెలిపారు.





