ప్రాంతీయం

కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన

28 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*ర్యాలీలు,సభలు, సమావేశాలకు అనుమతి లేదు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*

*కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన*

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్‌లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్,పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు మరియు మంచిర్యాల జోన్‌లోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి,చెన్నూర్, లక్షెట్టిపేట మున్సిపాలిటీలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పారదర్శకంగా ఫలితాలు ప్రకటించేందుకు కఠినమైన మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.

ఈ సందర్భంగా గోదావరిఖని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు,కౌంటింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.ఓట్ల లెక్కింపు భద్రతలో భాగంగా కౌంటింగ్ కేంద్రాల లోపలి భాగం, బయటి ప్రాంగణం మరియు వెలుపలి ప్రధాన రహదారుల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కౌంటింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో మరియు వెలుపలి రహదారుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, అనధికార వాహనాలు మరియు వ్యక్తులకు అనుమతి లేకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలు గుంపులుగా చేరకుండా ఉండాలని సూచించారు.ప్రజలు మరియు రాజకీయ ప్రతినిధులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డును భద్రతా సిబ్బందికి చూపించిన వారికే కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశం ఉంటుందని తెలిపారు.మొబైల్ ఫోన్లు,ఎలక్ట్రానిక్ పరికరాలు,లైటర్లు వంటి నిషేధిత వస్తువులను కౌంటింగ్ హాల్లులోకి తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. ర్యాలీలు,సభలు, సమావేశాలకు అనుమతి లేదని, బాణాసంచా మరియు డీజేలను పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు.

అధికారులు, పోలీసులు,ఏజెంట్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన భద్రతా బలగాలు:
• డీసీపీలు: 02
• అడిషనల్ డీసీపీ: 01
• ఏసీపీలు: 07
• సీఐలు: 33
• ఎస్‌ఐలు: 96
• ఏఎస్‌ఐలు / హెడ్ కానిస్టేబుళ్లు: 149
• కానిస్టేబుళ్లు: 518
• హోంగార్డులు: 113
• స్పెషల్ పార్టీ, ఆర్మ్డ్ సిబ్బంది: 158

మొత్తం సుమారు 1075 మంది పోలీస్ మరియు భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *