మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 10, 2026:
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన పోలింగ్ నిర్వహణకు జిల్లాలోని 1 మున్సిపల్ కార్పొరేషన్, 4 మున్సిపాలిటీలలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్లకు గాను 265 పోలింగ్ కేంద్రాలు, బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులకు గాను 68 పోలింగ్ కేంద్రాలు, చెన్నూర్ మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను 36 పోలింగ్ కేంద్రాలు, క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు 45 పోలింగ్ కేంద్రాలు, లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఒక బృందానికి 1 పి.ఓ., 1 ఎ.పి.ఓ., 3 ఓ.పి.ఓ. ల చొప్పున రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా అధికారుల బృందాలను కేటాయించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించబడిన సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని బజార్ ఏరియాలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని చెన్నూర్ పట్టణంలో గల అటవీశాఖ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని సూపర్ బజార్ ఏరియాలో గల ఆర్.కె.సి.ఓ.ఎ. క్లబ్ లో సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని పాత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కొరకు జోనల్, నోడల్ అధికారులు, పి.ఓ.లు, ఎ.పి.ఓ.లు, ఓ.పి.ఓ.లు, వీడియో, స్టాటిస్టిక్ సర్వేయలెన్స్ బృందాలు, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, మీడియా సెల్, ఇతర ఎన్నికల సంబంధిత సిబ్బందిని నియమించి, అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించి, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థుల తరఫున నియమించబడిన పూర్తి స్థాయి ఏజెంట్ల సమన్వయంతో తప్పుడు ఓట్ల పోలింగ్ ను నివారించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించకుండా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పోలింగ్ రోజున వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, నీడ ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని, పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల వ్యాసార్థం నిబంధన అమలులో ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీలు, పోటీలో ఉండే అభ్యర్థులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలు లభించినట్లయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





