నామినేషన్ ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా ,జనవరి 29, 2026:
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని పాత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ లతో కలిసి సందర్శించి నామినేషన్ల ప్రక్రియ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని 15 వార్డులకు సంబంధించి అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి నిర్ణీత సమయంలోగా స్వీకరించాలని, 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా నామినేషన్ స్వీకరణ కేంద్రంలో ఉన్నవారి నుండి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, సమయం ముగిసిన తర్వాత వచ్చిన వారి నుండి స్వీకరించడం జరగదని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ కొరకు టేబుళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, 100 మీటర్ల నిబంధన అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ దరఖాస్తులు నింపడం, జతపరచవలసిన పత్రాలు, ఇతర వివరాల కొరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 31వ తేదీన నామినేషన్లు పరిశీలించి అర్హత గల అభ్యర్థుల జాబితా ప్రకటన, ఫిబ్రవరి 1వ తేదీన నామినేషన్లపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ, 2వ తేదీన అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారం, 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటన జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్, 12వ తేదీన రీపోలింగ్ (ఏమైనా ఉన్నట్లయితే), 13వ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి గెలుపొందిన అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నం.08736-250501 ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల సంబంధించిన సమాచారం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన పై ఫిర్యాదుల కొరకు సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





