ఉపకార వేతనాల కొరకు షెడ్యూల్డ్ కులముల విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి.జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య
మంచిర్యాల జిల్లా ,జనవరి 29, 2026:
జిల్లాలో 5వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న షెడ్యూల్డ్ కులముల విద్యార్థులకు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కొరకు వివరాలు నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య అన్నారు. జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా విద్యాధికారి యాదయ్య, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, జిల్లా తపాలా శాఖ అధికారితో కలిసి మండల విద్యాధికారులు, ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ సంక్షేమ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ధిక సంవత్సరం పూర్తి కావస్తున్న సందర్బంగా 100 శాతం ఉపకార వేతనాల వివరాలు ఆన్ లైన్ లో లో నమోదు చేయాలని తెలిపారు. రాజీవ్ విద్యా దీవెన పథకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలో అర్హులైన 9, 10 తరగతులు చదువుచున్న షెడ్యూల్డ్ కులముల విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 3 వేల 500 రూపాయల చొప్పున విద్యార్ధి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుతున్న అర్హులైన షెడ్యూల్డ్ కులముల విద్యార్థులైన ప్రతి బాలికకు 1 వేయి 500 రూపాయలు, ప్రతి బాలునికి 1 వేయి రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. వివరాల నమోదు కొరకు అర్హులైన ప్రతి విద్యార్థి మీ-సేవా ద్వారా తీసుకున్న కుల ధ్రువీకారణ, నూతన ఆదాయ ధ్రువీకారణ పత్రాలు, విద్యార్ధి పేరు మీద తీసుకున్న బ్యాంకు ఖాతా / పోస్టల్ బ్యాంకు ఖాతాను ను కలిగి ఉండి, విద్యార్థి ఆధార్ కార్డు నవీకరణ చేసుకొని, బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తో అనుసంధానం చేసుకొని https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలలో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేని షెడ్యూల్డ్ కులములకు చెందిన విద్యార్థులకు వాటి నమోదు, మంజూరు బాధ్యతలు వసతి గృహ సంక్షేమ అధికారులు, మీ-సేవా నిర్వాహకులు తీసుకోవాలని, మీ-సేవ లో నమోదు అయిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి వెంటనే జారీ చేసే విధంగా ఆయా మండలాల తహసిల్దార్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల పేరు మీద బ్యాంకు ఖాతా తెరిచే బాధ్యత లను జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్, జిల్లా పోస్టల్ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాలలలో చదువుతున్న షెడ్యూల్డ్ కులముల విద్యార్థులను తరగతి వారిగా నివేదిక తయారు చేసుకొని, అర్హత కలిగిన విద్యార్థుల జాబితాను మండల విద్యాధికారులకు అందించాలని తెలిపారు. ఈ ప్రక్రియ అంతా 5 రోజులలో పూర్తి చేసి 100% శాతం ఉపకార వేతనాల నమోదు పని చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





