రామగుండం పోలీస్ కమిషనరేట్
*ప్రతి ప్రాణం విలువైనదే… అందరూ బాధ్యతగా వ్యవహరించాలి*
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలకు భద్రత : సీపీ అంబర్ కిషోర్ ఝా.
రోడ్డు భద్రతే లక్ష్యంగా ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లో “అరైవ్–అలైవ్” రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన టౌన్‌షిప్ ఆవరణలో, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి ఉత్తర్వులతో, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ పర్యవేక్షణలో రామగుండం సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో “అరైవ్–అలైవ్” రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎన్టీపీసీ ఉద్యోగులు, యువకులు,ఆటో డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై షార్ట్ ఫిలిమ్స్, పాటల ద్వారా అవగాహన కల్పించడంతో పాటు, గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు మరియు వాటి దుష్పరిణామాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు,ఎన్టీపీసీ అధికారులు కలిసి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం “అరైవ్–అలైవ్” వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ… పోలీసులు ఎంత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా,ప్రజలు రోడ్లపై ప్రయాణించే సమయంలో రోడ్డు భద్రత,ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు.మనం నిబంధనలు పాటించినప్పటికీ, ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశముందని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతతో వాహనాలు నడపాలని సూచించారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు.
ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ తమ సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు,రోడ్ సేఫ్టీ పాటించేలా చర్యలు తీసుకుంటామని, వాటిని ఉల్లంఘించిన వారి వివరాలను పోలీసులకు తెలియజేస్తామని తెలిపారు.ఇది బాధ్యతగల పౌరుడిగా తీసుకున్న అభినందనీయమైన నిర్ణయమని అన్నారు.
సమాజంలోని ప్రతి ఒక్కరూ “నేను తప్పు చేయను, ఎదుటివారిని తప్పు చేయనివ్వను” అనే భావనతో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.ప్రతి కుటుంబంలో ఒక్కరి ప్రాణం ఎంత విలువైనదో గుర్తించాలని తెలిపారు.ప్రతి వ్యక్తి దేశం,రాష్ట్ర అభివృద్ధికి ఏదో ఒక రూపంలో సహకరిస్తాడని పేర్కొన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీలు రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రాణాల రక్షణ లక్ష్యంగా ప్రారంభించిన “అరైవ్–అలైవ్” కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం,పట్టణం, కాలనీ వరకు ప్రజల్లో అవగాహన కల్పించేలా కొనసాగుతుందని తెలిపారు.వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు, శాశ్వత వికలాంగులైన వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు,మానసిక వేదన,కుటుంబాలపై పడుతున్న ప్రభావం గురించి ప్రజలకు వివరించి తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, ట్రాఫిక్ ఏసీపీ సి హెచ్ శ్రీనివాస్, రామగుండం సర్కిల్ సీఐ ప్రవీణ్ కుమార్,రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ఎన్టీపీసీ ఎస్‌ఐ ఉదయ్ కిరణ్, రామగుండం ఎస్‌ఐ సంధ్యారాణి, అంతర్గాం ఎస్‌ఐ వెంకట్ స్వామి తదితరులు పాల్గొన్నారు.





