చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా, జనవరి 15, 2026:
జిల్లాలోని గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా మంచిర్యాల నియోజకవర్గంలోని సాగు భూములలో చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని దండేపల్లి మండలంలోని తానిమడుగు వద్ద గల గూడెం ఎత్తిపోతల పథకం నుండి మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, నీటిపారుదల శాఖ, ఇతర అధికారులతో కలిసి సాగునీటి పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గూడెం ఎత్తిపోతల పథకం నుండి సాగు భూముల చివరి ఆయకట్టు వరకు పంట సాగుకు అవసరమైన నీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు అవసరం అయిన నీటిని ప్రణాళిక బద్ధంగా విడుదల చేయడం జరుగుతుందని, ఈ నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం సాగు సకాలంలో ప్రారంభించాలని, ఆలస్యంగా సాగు చేయడం వలన ఇబ్బందులు ఎదురవుతాయని, సాగుకు అవసరమైన నీటిని సకాలంలో అందిస్తామని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టి ఎం సి ల నీరు ఉందని, కార్యచరణ ప్రకారం సాగునీరు, త్రాగునీటికి వినియోగించడం జరుగుతుందని తెలిపారు.
మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో పంట సాగుకు అవసరమైన సాగునీటిని పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు అందించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా పైప్ లైన్ల మరమ్మత్తులను చేపట్టి పనులు పూర్తి చేసి సాగునీటి సరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





