విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య.జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్.
మంచిర్యాల జిల్లా, జనవరి 5, 2026:
జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ పరిధిలోని సంక్షేమ వసతిగృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ అన్నారు. సోమవారం వసతి గృహాల సంక్షేమ అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ ఉపసంచాలకులు మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ పరిధిలో కొనసాగుతున్న సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన పూర్తి సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల నమోదులు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని, వసతి గృహాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తత చర్యలు చేపట్టాలని తెలిపారు.
అనంతరం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ పరిధిలోని వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు తయారుచేసిన 2026 నూతన సంవత్సరం గ్రీటింగ్ కార్డులను జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవనం సముదాయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య, అన్ని శాఖల అధికారులకు అందించారు.
ఈ కార్యక్రమంలో ఎ ఎస్ డబ్ల్యూ ఓ ధర్మానంద్ గౌడ్, డి.చందన, కుమారస్వామి, వసతి గృహ సంక్షేమ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





