మహిళలకు ఆదర్శం – తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా,జనవరి 3, 2026:
భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. యాదయ్య, ఇతర శాఖల జిల్లా అధికారులతో కలిసి హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే బాలికా విద్యను ప్రోత్సహిస్తూ సమాజ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. మహిళ సాధికారత, బాల్య వివాహాలు, సతీసహగమనం దురాచారాల నిర్మూలనకు కృషి చేశారని, సమాజ అభివృద్ధికి బాలిక విద్య ఆవశ్యకతను తెలియజేశారని తెలిపారు. బాల బాలికలను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అనిర్వచనీయమైనదని, విద్యార్థులను సన్మార్గంలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయడంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని, విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించాలని తెలిపారు. బాలిక విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థినులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి విద్యను అభ్యసించేలా చైతన్య పరచాలని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మధ్యాహ్న భోజనంలో మెనూను అమలు చేస్తూ పౌష్టిక ఆహారం అందిస్తుందని, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా గుణాత్మక విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడారంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ఆయా రంగాలలో ప్రోత్సహించి ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దాలని తెలిపారు. అనంతరం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన 10 మంది మహిళ ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి జ్ఞాపకలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మహిళా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





