*రామగుండం పోలీస్ కమీషనరేట్*
అరైవ్–అలైవ్’ ట్రాఫిక్ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ..
రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న కీలక చర్యగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు.
జనవరి 1 నుంచి జనవరి 31 వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా,రోడ్డు భద్రతపై రూపొందించిన ‘అరైవ్–అలైవ్’ పోస్టర్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తన కార్యాలయంలో పోలీస్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ,రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, ప్రతిరోజూ జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని తెలిపారు.మద్యం సేవించి వాహనం నడపడం,రాంగ్ సైడ్ డ్రైవింగ్,సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం ద్వారా విద్యార్థులు,యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి,అతివేగం,సిగ్నల్ జంపింగ్, మద్యం తాగి వాహనం నడపడం,మైనర్ డ్రైవింగ్ చేయరాదనే విషయాలను స్పష్టంగా తెలియజేస్తామని తెలిపారు.ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం, రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనాలను స్వాధీనం చేసుకోవడం,రాత్రి సమయంలో రోడ్డు ఇరువైపులా వాహనాలు నిలిపివేయకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రహదారులు,ఎదురుగా వచ్చే వాహనాలు,పాదచారులు, జంతువులు,ట్రాఫిక్ సిగ్నల్స్ స్పష్టంగా కనిపించవని తెలిపారు.ఈ పరిస్థితుల్లో అతివేగం,ఓవర్‌టేకింగ్‌కు పాల్పడకుండా జాగ్రత్త వహించాలని,తప్పనిసరిగా లో-బీమ్ హెడ్‌లైట్లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.వాహనాల మధ్య సురక్షిత దూరాన్ని పాటించాలని,అకస్మాత్తుగా బ్రేకులు వేయకూడదని, లేన్ మార్చడంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వలన వాహనం అదుపు తప్పే ప్రమాదం ఉందని హెచ్చరించారు.నిర్దిష్ట వేగంతో వాహనాలు నడపడం ద్వారా స్కిడింగ్‌ను నివారించవచ్చని చెప్పారు.
తెలంగాణ పోలీస్ శాఖ సూచనలను ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించి,తమ ప్రయాణాన్ని సురక్షితంగా మరియు విజయవంతంగా ముగించాలని సీపీ కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరిఖని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.





