ప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా, డిసెంబర్ 29, 2025:
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో అర్జీదారాల నుండి దరఖాస్తులు స్వీకరించారు. నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన దండ నాయకుల విజయలక్ష్మి తన భర్త చనిపోయారని, మరణ ధ్రువీకరణ పత్రం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన భోగే రాజేశ్వరి తన భర్త మరణించినందున సంబంధిత కుటుంబ సభ్యుల దృవపత్రాన్ని ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన సంధ్యవేణి నడిపి రాజం తాను కొనుగోలు చేసిన భూమి నిషేధిత జాబితాలో ఉందని, తొలగించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జిల్లాలోని పోచంపాడు గ్రామస్తులు తమ గ్రామ శివారులోని హద్దుల సమస్యలు, విచారణ చేసి పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. నస్పూర్ మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మంద ఇసయ్య తనను, తన భార్యను ఇంటి నుండి వెళ్లగొట్టిన తన చిన్న కొడుకు, కోడలు వేధింపుల నుండి కాపాడి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణంలోని దొరగారిపల్లె ప్రాంతానికి చెందిన కొడిపే పోశవ్వ తనకు ఒంటరి మహిళ పింఛన్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మందమర్రి మండల కేంద్రానికి చెందిన ఆడెపు రాయమల్లు తన స్వార్జిత ఆస్తిని తన కుమారులకు పంచి ఇచ్చానని, ప్రస్తుతం తన పోషణ పట్టించుకోవడం లేదని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





