రహదారి భద్రత నియమాలు ప్రజలకు అర్థమయ్యేలా రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట జిల్లా డిసెంబర్, ( తెలుగు న్యూస్ 24/7 )
మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో జిల్లాస్థాయి రహదారి భద్రత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రత నియమాలను సరిగా పాటించడం మూలంగా ఎక్కువ శాతం రహదారి ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2026 జనవరి 1 నుండి జనవరి 31 వరకు రహదారి భద్రత మాసోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున జిల్లాలో కూడా ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు, వాహనదారులకు, డ్రైవర్లకు రహదారి భద్రత నియమాల పై పూర్తిగా అవగాహన కలిగేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. జనవరి మొదటి వారంలో రహదారి భద్రత నియమాలపై అవగాహన, రెండవ వారంలో పాఠశాల మరియు కళాశాలల విద్యార్థుల ర్యాలీలు, మూడో వారంలో విద్యార్థులచే రహదారి భద్రతపై వ్యాసరచన, ఉపన్యాసం, పెయింటింగ్ తదితర పోటీలు, నాలుగో వారంలో డ్రైవర్లకు మెడికల్ క్యాంపు, యువత చే 2కె, వన్ కే రన్, వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడం, సోషల్ మీడియాలో అవగాహన లాంటి కార్యక్రమాలను చేపట్టాలని, జిల్లాలోని అన్ని ముఖ్య కూడళ్లలో వివిధ కార్యక్రమాల ద్వారా రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలు, బార్కోడ్ ప్రదర్శన తదర కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఏ కమిటీ సభ్యుడు సూర్య వర్మ, ఎంవిఐ వెంకటనారాయణ, డీఈఓ శ్రీనివాసరెడ్డి, సీఐ వాసుదేవరావు, ఆర్టీసీ డిపో మేనేజర్, ఆర్ అండ్ బి, వైద్య తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.





