ఆయిల్ ఫామ్ ద్వారా రైతులకు అధిక దిగుబడి వస్తుందని గజ్వేల్ సహాయ సంచాలకులు బాబు నాయక్ అన్నారు. మండల పరిధిలోని మంతూర్ గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగు పైన రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంతూర్ గ్రామంలో రైతు నాచగిరి తన 3.20 ఎకరాల తోటలో కేవలం ఆరునెల వ్యవధిలో సుమారు 1,85,000 ఆదాయాన్ని పొందాడని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగులో పాటించాల్సిన మెలుకువలు, లాభాలు, నికర ఆదాయం, మల్చింగ్ పద్ధతులు, నీటి సరఫరా విధానాలు, సస్యరక్షణ చర్యలు మొదలైన అంశాలపై సమగ్రమైన వివరాలు రైతులకు తెలియజేశారు. ఆయిల్ ఫామ్ ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని, పంటల ఉత్పత్తిని పెంచుకునేందుకు ఈ పంట అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరేష్, ప్లాంటు మానిటరింగ్ ఆఫీసర్ రాములు, ఏఈఓ ప్రవీణ్, ఫీల్డ్ అసిస్టెంట్ రాకేష్, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.





