మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం.
అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో వన్యప్రాణులకు హాని
– అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ శ్రావణి
జైపూర్ : అడవులు, ప్లాంటేషన్ లలో పేరుకుపోయే ప్లాస్టిక్,ఇతర వ్యర్థ పదార్థాలతో పర్యావరణం కాలుష్యం కావడమే కాకుండా వన్య ప్రాణులకు హాని కలుగుతుందని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ శ్రావణి అన్నారు. అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం సాయంత్రం జైపూర్ మండలంలోని కాన్కూరు సమీపంలో ఉన్న నీలగిరి ప్లాంటేషన్ లో ఉన్న ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్ధాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డివిజనల్ మేనేజర్ మాట్లాడుతూ అటవీ ప్రాంతం మార్గాల మీదుగా వెళ్లేవారు ప్లాస్టిక్ వస్తువులను ఎక్కడపడితే అక్కడ పడేయ వద్దన్నారు. ప్లాంటేషన్లలో మద్యపానం నిషేధమని, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ప్లాంటేషన్లలో మద్యం సేవించి ఖాళీ సీసాలు,ఇతర ప్లాస్టిక్ పదార్థాలను పడేస్తూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారన్నారు. ఇట్లాంటి చర్యలను నియంత్రించడానికి, పలువురికి అవగాహన కలిగించడానికి అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్లాంటేషన్ లో పేరుకుపోయిన ప్లాస్టిక్ ఇతర వ్యర్థ పదార్థాలు తొలగింపు కార్యక్రమం చేపట్టమన్నారు.
ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్, కాగజ్ నగర్ రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ ఎడ్ల లక్ష్మణ్, బెల్లంపల్లి ప్లాంటేషన్ మేనేజర్ వి సునీత, ఫీల్డ్ సూపర్ వైజర్ లు, వాచర్లు పాల్గొన్నారు.
