– క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి
దౌల్తాబాద్: రెడ్డి సమాజంపై అసభ్యకరంగా మాట్లాడుతూ విషం చిమ్ముతున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న దమ్ముంటే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తిరిగి గెలవాలని డిమాండ్ చేశారు. ఉన్నత వర్గాల మద్దతు, ఓట్లు వేయనిదే గెలిచావా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. రెడ్డి సమాజంపై విషం చిమ్మతున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గత చరిత్రను గుర్తుకు తెచ్చుకోవాలని, టీ కోసం డబ్బులు అడిగిన ఆయన వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని నిలదీశారు. ముఖ్యంగా స్వాతంత్య్ర ఉద్యమం, రజాకార్లకు వ్యతిరేకంగా, భూదాన ఉద్యమంలో ఎంతోమంది రెడ్లు త్యాగాలు చేసి తమ వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచి దేవుళ్ళుగా చరిత్రలో నిలిచినట్లు స్పష్టం చేశారు. పదవి, డబ్బు కాంక్షతో పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తున్న తీన్మార్ మల్లన్న పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాంచంద్రరెడ్డి,మండల అధ్యక్షుడు కిష్టా రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నారెడ్డి ప్రభాకర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు సంపత్ రెడ్డి రెడ్డి సంగం నాయకులు నరసింహారెడ్డి, రాంరెడ్డి, నాగిరెడ్డి, నరసింహారెడ్డి, బుచ్చిరెడ్డి, ధూమ్ రెడ్డి, బిక్షపతి రెడ్డి, నరసింహారెడ్డి, అంజిరెడ్డి, ప్రతాపరెడ్డి, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.