ముస్తాబాద్, డిసెంబర్ 22 (24/7న్యూస్ ప్రతినిధి): అయ్యప్పస్వామి మహా పడిపూజ కన్నుల పండువగా జరిగింది. స్వామియే శరణం అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో మహర్షి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ జలజ రామ్మోహన్ రావు పండితులు ఆధ్వర్యంలో పాఠశాలలు ప్రాంతమంతా తిరుణాలవలె మారుమోగింది. పడిపూజ కార్యక్రమం శ్రీశ్రీ రాజు గురుస్వామి చేతుల మీదుగా అయ్యప్ప మహా పడిపూజ ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శబరిమలై సన్నిధిని తలపించేలా ప్రత్యేక అలంకరణ చేసి అష్టాదశ కలశాలతో అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకం కనుల పండుగగా అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి18 మెట్ల పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి అయ్యప్ప, గణపతి, కుమార స్వామి విగ్రహాలను ప్రతిష్టించి దీపాల ఆరాధన పూజలు నిర్వహించారు. రాజు గురుస్వామి ఆధ్వర్యంలో స్వాములు శరణు ఘోషల మధ్య భజనలు, కీర్తనలు పాడుతూ అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారు మోగింది. అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో మహా పడిపూజలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ అయ్యప్ప మాల ధరించడం అంటే ఎన్నో జన్మజన్మల పుణ్యమని అన్నారు. పూజ అనంతరం మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావన ఉండాలని రాజు గురుస్వామి సూచించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, స్థానిక ఎస్సై, సిహెచ్. గణేష్ వారి దంపతులు, కుటుంబ సమేతంగా భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
