రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 08: క్షేత్ర స్థాయిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్, గర్భిణీ స్త్రీల నమోదు, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, తదితర అంశాలపై ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలోని పలు రిజిస్టర్ లను ఆయన తనిఖీ చేశారు. మండలానికి సంబంధించిన ఆరోగ్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండవ, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ పెండింగ్ లో ఉంటే వెంటనే అర్హులైన వారిని క్షేత్ర స్థాయిలో గుర్తించి వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. అలాగే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ప్రతీరోజూ చేయాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులను ప్రతిరోజూ అడిగి తెలుసుకోవాలని అన్నారు. గర్భిణి స్త్రీల నమోదు చేయాలని, టీబీ కేసుల గుర్తింపు పరీక్షలు చేయాలని సూచించారు. చిన్నారుల జాతీయ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం గురించి ఆరోగ్య సిబ్బంది పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. సుమన్ మోహన్ రావు, వైద్యాధికారి డా. మోహన కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
*కోనరావుపేట చెరువు సుందరీకరణకు తగిన ఏర్పాట్లు చేయాలి*
కోనరావుపేట మండల కేంద్రంలోని మసీన్ చెరువు సుందరీకరణకు తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. మంగళవారం చెరువును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ఆయన చెరువు కట్టమీద లైటింగ్, బెంచీలు ఏర్పాటు చేయాలని అన్నారు. సైడ్ రెయిలింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం
కోనరావుపేట నుండి కొలనూర్ రోడ్ వెంబడి హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను గ్రామీణాభివృద్ధి, పంచాయితీ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రోడ్ల వెంబడి ఎవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా నాటిన మొక్కలన్నీ వంద శాతం సంరక్షించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. మొక్కల చుట్టూ ఎలాంటి గడ్డి లేకుండా పాదులు చేసి ట్రీ గార్డ్స్ కు మంచి సపోర్ట్ కర్ర ఏర్పాటు చేయాలని అన్నారు. చనిపోయిన మొక్కల స్థానే వెంటనే క్రొత్త మొక్కలు నాటాలన్నారు.
ఈ పరిశీలనలో డీఆర్డీఓ కె. కౌటిల్య, డీపీఓ ఏ. రవీందర్, ఎపీడీ నరసింహలు, ఎంపీడీఓ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.





