రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 08/
యువత గంజాయి వైపు మళ్ళకుండా, వారికి మంచి భవిష్యత్తు అందించే బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో రెవిన్యూ, పోలీసు, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో గంజాయి రవాణా, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులోజిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ బికె. రాహుల్ హెగ్డే, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. చంద్రశేఖర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి, మాదక ద్రవ్యాలు సామాజిక చెడు అని, వీటితో సమాజం దెబ్బతింటుందని, శాంతిని కోల్పోతుందని అన్నారు. ఇట్టి సామాజిక చెడును ప్రారంభ దశలో నియంత్రించాలని ఆయన తెలిపారు. యుక్త వయస్సు పిల్లలు వీటికి ఎక్కువ ప్రభావితం అవుతారని ఆయన అన్నారు. సమాజంలో సర్పంచ్, ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకమని, సామాజిక చెడు నిర్మూలనలో వీరు క్రియాశీలకంగా ఉండాలని అన్నారు. సామాజిక చెడు పై అవగాహన గురించి ప్రతిచోటా చర్చ జరగాలని, ఈ చెడు ఎందుకొస్తుంది, దీనిని ఎలా అరికట్టాలనే దానిపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. పాఠశాలల మేనేజ్మెంట్ కమిటీలు దీనిని బాధ్యతగా తీసుకోవాలని, ఒక నెట్ వర్క్ లా, సమిష్టిగా పనిచేయాలని అన్నారు. ఎవరికైనా కౌన్సిలింగ్ అవసరమైన పక్షంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కౌన్సెలింగ్ సదుపాయం ఉందని కలెక్టర్ తెలిపారు. మాదకద్రవ్యాలు సేవించిన, సాగు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి సేవించే 250 – 300 మందిని గుర్తించి, పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఇప్పటికి 103 మందిని అరెస్ట్ చేసినట్లు, 182 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. నిందితులపై పిడి యాక్ట్ కు చర్యలు చేపడతామన్నారు. గ్రామంలో ఏం జరుగుతుంది, క్రొత్తవారు, దూరప్రాంతాల నుండి ఎవరొచ్చారు అనే సమాచారం ప్రజాప్రతినిధులకు తెలుస్తుందని, వారు అనుమానితుల సమాచారం అందించాలని అన్నారు. విద్యా సంస్ధల్లో ర్యాగింగ్ పై ఎలా ఫిర్యాదు చేస్తున్నారో, అదే విధంగా మాదకద్రవ్యాలపై సమాచారం ఇవ్వాలని అన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గుడుంబా రహిత గ్రామాలకు కృషి చేసినట్లే, మత్తు రహిత గ్రామాలకు కృషి చేయాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ, సరదాగా మొదలైన అలవాటు బానిసగా మార్చుతుందని, శారీరకంగా, మానసికంగా నిర్వీర్యం చేసి యువతను నాశనం చేస్తుందని అన్నారు. ఈ మహమ్మారిని ఆదిలోనే అంతం చేయాలని, ఆరోగ్య సమాజ నిర్మాణం చేయాలని అన్నారు. సమిష్టి కృషితో గ్రామ, పట్టణ స్థాయిలో పనిచేయాలని ఆయన అన్నారు. గంజాయి, మాదకద్రవ్యాలపై *18004252523*, అధికారుల నెంబర్లు *9440902687, 9440902704, 9440902705* లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన పై పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి సిఇఓ గౌతం రెడ్డి, డిపివో రవీందర్, సిరిసిల్ల నియోజకవర్గ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, కళాశాల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎక్సైజ్ సిఐ లు ఎంపీఆర్. చంద్రశేఖర్, రాము, శ్రీనివాస్, ఎక్సైజ్ ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.





