గోదావరిలోయ విప్లవ స్రవంతిలోని విప్లవ పార్టీల ఐక్యతను దెబ్బతీయడానికి కామ్రేడ్ కూర రాజన్న పై బురద జల్లుతున్న విచ్ఛిన్నకర శక్తులను తిప్పికొట్టండి.
సిద్దిపేట జిల్లా జూన్ 21
గడిచిన నాలుగు సంవత్సరాలుగా గోదావరిలోయ విప్లవ స్రవంతిలోని విప్లవ పార్టీలను ఐక్యం చేయడానికి కృషి చేస్తున్న సిపిఐ(ఎం-ఎల్) జనశక్తి నాయకుడు కామ్రేడ్ కూర రాజన్న పై ఎం.వి ప్రసాద్ ముఠా 19 సంవత్సరాలుగా బురద జల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది గోదావరిలోయ విప్లవ స్రవంతిని ఐక్యం చేస్తూ, ఏకైక విప్లవ పార్టీ నిర్మాణం దిశగా కామ్రేడ్ కూర రాజన్న చేస్తున్న కృషి పైన జరుగుతున్న దాడి మాత్రమే. శత్రుపూరితమైన ఈ దాడిని, నిందా ప్రచారాన్ని విప్లవశక్తులు ఖండించాలని కోరుతున్నాం.
గుజరాత్ మారణకాండను నిరసిస్తూ కరీంనగర్ లో జరిగిన నిరసన క్యాంపెయిన్ లో అరెస్ట్ అయిన ఎం.వి.ప్రసాద్. నిర్బంధానికి భయపడి ఆనాటి ఎస్పీ కి కోవర్టుగా మారాడు. 2002లో జరిగిన జనశక్తి కేంద్ర కమిటీ విస్తృత సమావేశం సందర్భంగా కామ్రేడ్ కూర రాజన్న , రామచంద్రన్ వర్గాలుగా పార్టీ చీలిపోయిందని, తాను రామచంద్రన్ వర్గంలో ఉన్నట్లు ఒక తప్పుడు వార్తను పత్రికల్లో రాయించాడు. ఒక రహస్య పార్టీ కేంద్ర ప్లీనం జరుగుతున్న విషయాన్ని పత్రికలకు ఉప్పందించి, అక్కడ పార్టీ రెండుగా చీలిపోయిందని తప్పుడు వార్తను పత్రికలకు అందించడాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంది. వెంటనే కేంద్ర కమిటీ సమావేశమై ఇది రాజ్యం ప్రేరిత చర్య అని ప్రకటించి, ఎం.వి.ప్రసాద్ రాజకీయ కోవర్టు అని తేల్చి వెంటనే పార్టీ నుండి బహిష్కరించింది.పార్టీ వాస్తవంగా ఎక్కడా చీలిపోలేదని అందరూ ఐక్యంగా,ఉత్సాహంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులను కోరింది.
కేంద్ర కమిటీ ప్రకటనతో బట్టబయలైన ఎం.వి ప్రసాద్ ఇక తన విద్రోహాచర్యలను బహిరంగంగానే కొనసాగిస్తూ వచ్చాడు. శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ ఆత్మరక్షణ సామాగ్రిని పోలీసులకు అప్పగించినాడు.దీంతో ఇతను రాజ్యం యంత్రాంగంలో కొనసాగుతుండని పార్టీ ప్రకటించింది.చివరికి పార్టీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా,జగ్గంపేటలో నిర్మాణమైన కామ్రేడ్ రంగవల్లి నగర్ పై 2005 ఏప్రిల్ 5 నాడు తుపాకులు తదితర మారనాయుధాలతో విరుచుకుపడి 50 మంది ప్రజలను గాయపరిచాడు. రైతు-కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహాయ కార్యదర్శి, దళిత ఉద్యమ నాయకుడు కామ్రేడ్ కొంగు దేవ సహాయం ను 85 కత్తిపోట్లతో ఒళ్లంతా చింద్రం చేశాడు. రక్తపాతం సృష్టించాడు. స్థానిక పోలీసుల దన్నుతో స్వైర విహారం చేశాడు. తీవ్రమైన గాయాలతో 2005 ఎప్రిల్ 8 నాడు కామ్రేడ్ కొంగు దేవ సహాయం హాస్పిటల్లోనే మరణించాడు.ఈ సంఘటనతో ఎం.వి ప్రసాద్ కోవర్టు,విచ్ఛిన్నకుడే కాదు,హాంతకుడని తెలియజేస్తుంది.అందుకే ద్రోహి ఎం.వి ప్రసాద్ ప్రజల కోపాగ్నికి గురైనాడు.
ఇలాంటి తప్పులన్నింటిపై ఆత్మ విమర్శకు బదులు 19 సంవత్సరాలుగా విప్లవ ద్రోహి ఎం.వి ప్రసాద్ ను తలకెత్తుకొని మల్లెపల్లి ప్రభాకర్,బుద్ధ సత్యనారాయణ లు నెత్తిన మోస్తున్నారు.వీళ్ళు విప్లవ ద్రోహికి విప్లవకారుడని ముద్ర తగిలించుటకు వర్ధంతులు, జయంతుల పేరిట ఉరేగుతున్నారు.సొంత బతుకుదెరువు కై విప్లవం పేరిట ఆర్థిక నేరగాళ్ల గుంపులుగా తయారై మల్లెపల్లి ప్రభాకర్,బుద్ద సత్యనారాయణ ముఠా బ్రతుకుతున్నారు. ఇలాంటి నేరస్థ వసూళ్ల మూఠాలు తమ ఉనికి కోసం ఇలాంటి ప్రకటనలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రతిఘటన పోరాటం గురించి తెలువని,ఆ పోరాటంలో పాల్గొనని,నిర్మాణాలు చేయడం ఎరుగని,వ్యక్తిగత జీవితాలకు అలవాటు పడ్డ ఈ ముఠా ప్రతిఘటన పోరాటంకు జనశక్తి ద్రోహం చేసిందని మాట్లాడడం కూడా రాజ్యాంగ యంత్రానికి,పోలీస్ లకు దాసోహమైన దాంట్లో భాగమేనని స్పష్టం చేస్తున్నాం. మల్లెపల్లి ప్రభాకర్,బుద్ద సత్యనారాయణ ల ముఠా ఇప్పటికైనా ఇలాంటి విద్రోహకరమైన, విచ్ఛిన్నకరమైన ప్రకటనలకు స్వస్తి చెప్పాలి.లేనిచో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం.
అట్లాగే విప్లవ శ్రేణులు ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము.
