Breaking News

మన్యంలో ప్రమాద ఘంటికలు …

78 Views

జూన్ 3, 24/7 తెలుగు న్యూస్: మన్యంలో ప్రమాద ఘంటికలు.

అల్లూరి జిల్లాలో పెరుగుతున్న జ్వర బాధితులు
కొద్ది రోజులుగా కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
ప్రజాశక్తి- పాడేరు, రంపచోడవరం, చింతూరు విలేకరులు (అల్లూరి జిల్లా) : మన్యంలో జ్వరాలు ప్రబలుతున్నాయి. వైరల్‌ జ్వరాలతో పాటు మలేరియా కేసులూ క్రమేపీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అల్లూరి జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరుల్లోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులకు వారం రోజులుగా జ్వర బాధితులు పెరిగారు. జూన్‌ నెలలో ఈ జ్వరాల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వైద్యాధికారులు చెబుతున్నారు. మన్యంలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణం ఉంది. తీవ్రమైన ఎండలతోపాటు కుండపోత వర్షాలూ పడుతున్నాయి. దోమలూ పెరుగుతున్నాయి. ఇప్పుడే ఆస్పత్రులకు జ్వర బాధితుల తాకిడి పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 62 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గడిచిన ఐదు నెలల కాలంలో 791 మలేరియా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇవిగాకుండా అరకులోయ, రంపచోడవరం, చింతూరు ఏరియా ఆస్పత్రుల్లోనూ, పాడేరులోని సర్వజన ఆస్పత్రిలోనూ వందల కేసులు నమోదైనట్లు సమాచారం. కొద్ది రోజులుగా ఈ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి గత శుక్రవారం పెద్ద సంఖ్యలో జ్వర బాధితులు వచ్చారు. ఒపిలో నమోదైన 90కిపైగా జ్వర బాధితుల్లో డాక్టర్ల సూచన మేరకు 27 మందికి మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ ఎవరికీ మలేరియా నిర్ధారణ కానప్పటికీ వైరల్‌ జ్వరాలు నమోదవుతున్నాయి. మినుములూరు పిహెచ్‌సిని ‘ప్రజాశక్తి’ సందర్శించగా సాధారణ జ్వరాలు నమోదవుతున్నట్టు వైద్యాధికారి డాక్టర్‌ వి.సాయి శ్రీ చెప్పారు. మే నెలలో ఎనిమిది మలేరియా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు తెలిపారు. రక్త పరీక్షల ద్వారా నిర్ధారించి రోగులకు తక్షణ వైద్య సేవలందిస్తున్నామని చెప్పారు.

రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో 95 కేసులు
రంపచోడవరం ఏరియా ఆస్పత్రి పరిధిలో జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. మే నెలలో 95 కేసులు నమోదవగా ఐదుగురికి మలేరియా పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారు. ‘ఇప్పుడిప్పుడే జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. రోజుకు రెండు నుంచి ఐదు కేసులు వస్తున్నాయి. జ్వరాలతో వచ్చే వారి కోసం ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశాం. మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం’ అని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కె.లక్ష్మి తెలిపారు.

చింతూరులో ఇలా..
చింతూరు మండల పరిసర ప్రాంతాల్లో రోజురోజుకు జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. మోతుగూడెం, పొల్లూరు, తోలుగొండ, తులసిపాక, లక్కవరం, గూడూరు, మదుగూరు ప్రాంతాల్లో ఏటా మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. చింతూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడు నెలల నుండి మలేరియా కేసులు గణనీయంగా పెరిగాయి. 46 కేసులు మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణయ్యాయి. మొత్తం 19,723 రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. చిన్నారులు, వృద్ధులకు టైఫాయిడ్‌ జ్వరాలు సోకుతున్నాయి.

టైఫాయిడ్‌తో బాధపడుతున్నాను : ఎల్లమ్మ, వీరాపురం గ్రామం, చింతూరు మండలం

ఒంట్లో బాగోకపోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకున్నాను. టైఫాయిడ్‌ అని తేలింది. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మందులు వాడుతున్నాను.

మా పాపకు మెరుగైన వైద్యం అందించాలి : మిడియం మల్లమ్మ, చెడుమూరు గ్రామం, చింతూరు మండలం
నాలుగు రోజుల నుంచి మా పాప అనారోగ్యంతో బాధపడుతోంది. పరీక్షలు చేయించగా టైఫాయిడ్‌గా తేలింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాం. ఇంకా మెరుగైన వైద్యం అందించాలి. జ్వరాల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలి.

అప్రమత్తంగా ఉన్నాం : డాక్టర్‌ సి.జమాల్‌ బాషా, జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి
జిల్లాలో మలేరియా హైరిస్క్‌ గ్రామాలను గుర్తించి ఏప్రిల్‌ 15 నుంచి మే 31 వరకు దోమల నివారణ మందు తొలి రౌండు పిచికారీ కార్యక్రమం చేపట్టాం. ఇప్పటి వరకూ జిల్లాలోని పిహెచ్‌సిల్లో 791 మలేరియా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మలేరియా నియంత్రణలో భాగంగా హైరిస్క్‌ పరిధిలో ఉన్న 1,767 గ్రామాలను ఎంపిక చేసి చర్యలు చేపట్టాం. ఇప్పటి వరకూ 1,499 గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ పూర్తయింది. వర్షరుతువు మొదలయ్యాక జూన్‌ నుండి జులై వరకూ, అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకూ తప్పనిసరిగా మరో రెండు విడతలుగా పిచికారీ చర్యలు చేపట్టాలి. జ్వర బాధితులు అలక్ష్యం చేయకుండా తక్షణమే రక్త పరీక్షలు చేసుకొని తగు చికిత్స పొందాలి. జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉన్నాం. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7