ప్రాంతీయం

మానవత్వాన్ని చాటుకున్న ప్రభుత్వ ఉద్యోగి

59 Views

పుట్టినరోజు వేడుకలు అంటేనే అంగరంగ వైభవంగా విందులు వినోదాలతో ఎంతో ఆడంబరంగా జరుపుకునే నేటి రోజులలో తమ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పోతరాజు మాధవి-పర్ష రాములు దంపతులు. సోమవారం రాయపోల్ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పోతరాజు మాధవి-పర్ష రాములు దంపతులు తమ చిన్న కుమారుడు వేదాన్ష్ పుట్టినరోజు సందర్భంగా రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో తల్లిదండ్రులు మరణించిన ముగ్గురు పిల్లలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పోతరాజు పర్షరాములు మాట్లాడుతూ లింగారెడ్డి పల్లి గ్రామంలో మచ్చ సుజాత స్వామి దంపతులు 10 సంవత్సరాల క్రితమే మృతి చెందారు. వారికి సంధ్య దివ్య బిక్షపతి ముగ్గురు పిల్లలు ఉండగా వారి ఆలనా పాలన నానమ్మ మచ్చ దుర్గమ్మ చూసుకునేది. రెండు నెలల క్రితం దుర్గమ్మ కూడా మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాధలుగా మారారు. వారి ఆలనా పాలన చూసేవారే కరువయ్యారు. సమాజంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారని కానీ ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన అందరికీ ఉండదన్నారు. నేటితరం మనుషులలో స్వార్థం ఎక్కువైందని ఎంత సంపాదించిన సంతృప్తి చెందడం లేదన్నారు. మేము సంపాదించే సంపదనలో కొంత భాగం అనాధ పిల్లలకు, నిరుపేద కుటుంబాలకు, అభాగ్యులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సేవా చేపట్టడం జరిగిందన్నారు. జీవితంలో ఎన్ని ఆస్తులు, డబ్బులు సంపాదించిన కలగని సంతృప్తి పేదవారికి ఆపదలో ఉన్న వారితో ఆదుకొని సేవ చేస్తే వారి ముఖంలో కనిపించే చిరునవ్వు ఎంతో సంతృప్తిని కలిగిస్తోందన్నారు. చాలామంది ఉత్సవాల పేరుతో అనవసర కార్యక్రమాలకు వేలకు వేలు డబ్బులు ఖర్చు చేశారని ఆపదలో ఉన్న నిరుపేదలకు సహాయం చేయడానికి ముందుకు రాలేకపోతున్నారన్ని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు, జర్నలిస్టులు ఉషనగళ్ళ నర్సింలు,మన్నే గణేష్, అంగన్వాడి టీచర్ జనత భాయి, గ్రామస్తులు కొత్తపల్లి స్వామి, కనకయ్య, స్వామి, బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka