వరి వేద సాగు పై క్షేత్ర ప్రదర్శన
సిద్దిపేట జిల్లా (ఏప్రిల్ 18)
మర్కుకు మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో వేద సాగు మరియు ఆయిల్ పామ్ తోటల పైన సిద్దిపేట జిల్లా డీలర్లకు క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డా.టి. నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ వరిలో వేద సాగువలన రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గడంతో పాటు సరైన సమయంలో విత్తనం వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని, సాధారణ పద్ధతితో పోలిస్తే దిగుబడి కూడా 2 నుంచి 3 క్వింటాలు ఎక్కువగా వస్తుందని తెలియజేశారు. పంటకాలం 7 నుంచి 10 రోజులు తగ్గుతుందని తెలియజేశారు. ఆయిల్ ఫామ్ పంట సాగు గురించి మాట్లాడుతూ ఒక ఎకరా వరి సాగుకు అవసరమైన నీటితో 4 ఎకరాల పామాయిల్ పంటను సాగు చేయవచ్చు అని తెలియజేశారు. రైతులు నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం మరియు పురుగుల యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. వాతావరణాన్ని బట్టి మొక్కల పాదులలో తగినంత తేమ ఉండేలా నీరు అందించాలని, ఆయిల్ పామ్ చెట్టు నాటిన 14 నెలల నుండి పూతకు వస్తాయని చెట్టు తొలి దశలో వేరువేవస్తా బాగా అభివృద్ధి చెంది నీరు పోషకాలు గ్రహించి చెట్టు బాగా పెరగాలంటే ఈ పూలగుతులను వెంటనే తుంచివేయాలని సూచించారు. ఆయిల్ పామ్ తోటలో మొక్కల మధ్య దూరం ఎక్కువ కనుక తొలి 3 సంవత్సరాల కాలంలో అంతర పంటలు పండించి రైతులు ఆదాయం పొందవచ్చునని తెలియజేశారు. 8 సంవత్సరాల తరువాత కోకో ,మిరియాలు వంటి అంతర్ పంటలను సాగు చేసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేశీ కోఆర్డినేటర్ శంకర్ రావు, విజయ్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు రజనీకాంత్ మరియు విష్ణువర్ధన్, రైతులు మరియు డీలర్లు పాల్గొన్నారు.





