వేములవాడలో భక్తుల రద్దీ
ఎప్పటికప్పుడు పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ
అధికారులకు సూచనలు
వేములవాడ , మార్చి 8, 2024
వేములవాడ పట్టణం శివ నామస్మరణతో మార్మోగుతుంది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వీవీఐపీ, వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బందితో పాటు పోలీసులు, ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తగిన సహాయ సహకారాలను అందిస్తున్నారు.
ఈ సందర్బంగా వేములవాడ ఎం.ఎల్. ఏ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ ఆవరణలో భక్తులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించారు. క్యూ లైన్లో ఉన్న భక్తులతో మాట్లాడారు. పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అందిస్తున్న సేవా కార్యక్రమాలు పరిశీలించి, నిర్వాహకులు, వాలంటీర్లను విప్ అభినందించారు. అనంతరం స్వామి వారిని విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.
అలాగే కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆలయ ఆవరణలో పరిశీలించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు చేశారు.
ఆలయంలో హైకోర్టు జడ్జి పూజలు
హైకోర్టు జడ్జి కె సురేందర్ కుటుంబ సభ్యులతో ఆలయానికి రాగా, ఈఓ కృష్ణ ప్రసాద్, ఏఈఓ హరికిషన్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హైకోర్టు జడ్జితోపాటు
రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్జి ప్రేమలత, సబ్ జడ్జి రవీందర్, జూనియర్ సివిల్ జడ్జిలు ప్రవీణ్, జ్యోతిర్మయి, సుజన వారి కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకోగా, వారిని ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే
స్వామివారిని కరీంనగర్ ఎం ఎల్ ఏ గంగుల కమలాకర్, జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ తదితరులు దర్శించుకున్నారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, డీఎస్పీ నాగేంద్రచారి, ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
