మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ విద్యారంగ సమస్యలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సహకారంతో పరిష్కరించడానికి తప్పకుండా కృషి చేస్తానని కలెక్టర్ సంతోష్ వెల్లడించారు. ఆదివారం పద్మనాయక ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచనల మేరకు మంచిర్యాల నియోజకవర్గం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టారు. ఆసాంతం ఆలకించిన కలెక్టర్, ఎమ్మెల్యే స్పందన తెలిపారు. పాఠశాలలో ముక్యంగా స్కావెంజర్ సమస్య ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. అప్పటి వరకు గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీ లు స్కావెంజర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్ వాడి, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, వైద్య రంగం పురోగతి కోసం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, మంచిర్యాల నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యారంగం మెరుగైన ఫలితాలు అందించాలని ప్రధానోపాధ్యాయులను కోరారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలని డ్రాఫవుట్ లేకుండా విద్యను అందించాలని అన్నారు. పరీక్షల్లో ఉత్తీర్నత శాతం పెంచి ప్రభుత్వ పాఠశాలలు మేలు అనే విధంగా పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంతో పాటు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాలలో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.
ఈసమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్, జిల్లా విద్యా శాఖ అధికారి యాదయ్య, విద్యా శాఖాధికారులు పాల్గొన్నారు.
