పాలకులకు బుద్ధిని ప్రసాదించాలంటూ మంచిర్యాల కట్ట పోచమ్మ గుడిలో బీసీ నాయకుల పూజలు!!
బీసీ జనగణన మరియు చట్టసభల్లో బీసీ వాటా బిల్లు తీసుకొచ్చే సద్బుద్ధిని ప్రధాని నరేంద్ర మోడీకి కలిగించాలని మంచిర్యాల జిల్లా బీసీ ఐక్యవేదిక నాయకులు ప్రార్థనలు చేశారు. హిందూ బీసీ మహాసభ, తెలంగాణా బీసీ ఐక్య వేదిక పిలుపుమేరకు మంచిర్యాల కట్ట పోచమ్మ గుడిలో ఆదివారం రోజున వారు ఈ కార్యక్రమం చేపట్టారు.
బీసీ జనాభా లెక్కలు సేకరిస్తామని హామీని ఇచ్చిన మోడి ప్రభుత్వం అగ్రవర్ణాల ఒత్తిళ్లకు తలొగ్గి నేడు వెనక్కు తగ్గిందని వారు ఆరోపించారు. బీసీల జనాభా లెక్కలు తేలితేనే రిజర్వేషన్లు, చట్టసభల్లో వాటా ఇతర సంక్షేమ ఫలాలు బీసీ ప్రజలకు న్యాయంగా దక్కుతాయని వారు పేర్కొన్నారు. జనాభా లెక్కల్లో కోళ్లు , మేకలు , పందుల లెక్కలు తీస్తుండగా ప్రభుత్వాలు బీసీలను పట్టించుకోకపోవడం అన్యాయమని వారు పేర్కొన్నారు.
మెజార్టీ హిందువులైన బీసీలకు సమన్యాయం అందించడానికి సరైన చర్యలు తీసుకునే పాలకులనే దేవతలు మెచ్చుకుంటారన్న సత్యాన్ని కేంద్ర పాలకులు గుర్తించాలని వారు తెలిపారు.
