బర్రెలక్కకు పౌరసంఘాల మద్దతు
మంచిర్యాల రాముని చెరువు కట్టపై వాకర్స్ అసోసియేషన్ సంఘీభావ ప్రదర్శన.
కొల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క (శిరీష)పై జరుగుతున్న దాడులను ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలని వివిధ పౌర సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
గురువారం రోజున మంచిర్యాల రాముని చెరువు కట్టపై వాకర్స్ అసోసియేషన్ తరపున బర్రెలక్కకు మద్దతుగా జరిగిన సంఘీభావ ప్రదర్శనలో వారు పాల్గొన్నారు. నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న బర్రెలక్కకు అంబేద్కర్ రాజ్యాంగం అందించిన హక్కును కాలరాసే జబర్దస్తీ నడవదని వారు పేర్కొన్నారు. నిరుద్యోగుల బాధలను తీర్చలేని పాలకవర్గాలు ప్రశ్నించే గొంతుకులను అణచివేయాలని చూస్తున్నారని వారు పేర్కొన్నారు.
ఎన్నికల్లో నిలబడి ప్రజల గొంతుకుని వినిపించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నదని.. తెలంగాణ పౌర సమాజం నిరుద్యోగ గొంతులకు మద్దతుగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. బర్రెలక్కకు పోలీసు రక్షణ కల్పించాలని, ప్రజలందరూ ప్రశ్నించే గొంతుకలనే తమ ప్రతినిధులుగా చట్టసభల్లోకి పంపించాలని ప్రజలు సమస్యలు తీర్చగలిగే వాడికే గద్దె మీద కూర్చునే హక్కు ఉన్నదని వారు పేర్కొన్నారు.
తెలంగాణ నుండి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు బర్రెలక్కకు మద్దతుగా స్పందించాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాముని చెరువు వాకర్స్ కమిటీ అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య, సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం, ట్రేడ్ యూనియన్ నాయకులు కామిల్ల జయరాజు, అబ్దుల్ పాషా, గుంతి ప్రభాకర్, మొగిలి తిరుపతి, కొండపాక ప్రభాకర్, డాక్టర్ గోలి పూర్ణచందర్, ఐలయ్య, అడ్వకేట్ కొట్టె తిరుపతి, సిరికొండ సురేందర్, సూర్యనారాయణ గౌడ్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.






