మహబూబాబాద్, నవంబర్ 08:
పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక ఆదేశించారు.ఐ.డి.ఓ.సి.లోని కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ… పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
నీటి సమస్య ఉండకూడదని, రన్నింగ్ వాటర్ కనెక్షన్ ఉండి తీరాలన్నారు. పోలింగ్ కేంద్రంలో 2 ట్యూబ్ లైట్స్, వెబ్ కాస్టింగ్, సిసి కెమెరాల ఏర్పాటుకు 2 త్రి ప్లగ్ పిన్స్ ఏర్పాటు చేయాలన్నారు.
వారంలోగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణలు పూర్తి చేయాలన్నారు.ఎంపీడీవోలు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించాలని వసతుల కల్పనపై నివేదిక ఇవ్వాలన్నారు.గొల్లచెర్ల లో చేపట్టిన ర్యాంపు నిర్మాణాలు వీల్ చైర్ కు అనుకూలంగా లేవని అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రంలోని రాంపులను వీల్ చైర్ కు అనుకూలంగా ఉన్నది లేనిది పరిశీలించాలన్నారు.
గూడూరు బయ్యారం ఏజెన్సీ మండలాలలో వసతి గృహాలను వినియోగించుకోవాలని పోలింగ్ కేంద్రాల నుండి వసతి గృహాల వరకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయించాలన్నారు.
మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద చేపట్టిన పోలింగ్ కేంద్రాల లోని పాఠశాలల్లో తప్పనిసరిగా ప్రహరీ నిర్మాణం చేపట్టాలని, మిగతా వాటిల్లో బార్ కేడింగ్ చేపట్టాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా అధికారులు ఎంపిడివోలు,మున్సిపల్ కమిషనర్ లు పాల్గొన్నారు.





