ప్రజలను,నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఓడించండి
సిద్దిపేట ఎన్నికల బరిలో ప్రజా సంఘాల ఉమ్మడి అభ్యర్థిని నిలుపుతాం
నవంబర్ 4
సిద్దిపేట జిల్లా కాలంలో విద్యార్థులను,ప్రజలను,నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో ఓడించాలని విద్యార్థి,ప్రజా సంఘాల నాయకులు తెలిపారు.
శనివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో విద్యార్థి,నిరుద్యోగ,ప్రజా సంఘాలు ఉమ్మడిగా విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సత్తయ్య,శంకర్,శ్రీకాంత్,కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో ప్రజలను, నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసిందని అన్నారు.నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు చూపించకుండా అనేక ప్రలోభాలకు గురి చేస్తోందని మండిపడ్డారు.టీఎస్పిఎస్సీ ప్రక్షాళన చేయకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారో చెప్పాలని ప్రశ్నించారు.సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ప్రగల్భాలు పలికే మంత్రి హరీష్ రావు నియోజక వర్గంలోనీ గ్రామాల్లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఎంతో తెలపాలని కోరారు.
ప్రాజెక్టుల,రైల్వే లైన్,స్మశాన వాటికలు,పల్లె ప్రకృతి వనాల పేరుతో దళిత బహుజనుల భూములను తీసుకొని పూర్తిస్థాయి నష్ట పరిహారం అందించకుండా నష్టపరిచి వారిని కూలీలుగా మార్చారని దుయ్యబట్టారు.దళితులకు మూడెకరాల భూమిని ఎందుకు ఇవ్వలేదని అన్నారు.ఐటి హబ్,మెడికల్ కాలేజీ పేరుతో అవినీతికి పాల్పడుతున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.అభివృద్ది అంటే పెద్ద బిల్డింగులు కాదని,పేద ప్రజల స్థితిగతుల్లో మార్పు రావాలని, ఉపాధి అవకాశాలు దొరకాలని స్పష్టం చేశారు.ఈ ఎన్నికల్లో సుదీర్ఘ కాలంగా విద్యార్థి నిరుద్యోగ,ప్రజల పక్షాన కొట్లాడే వ్యక్తిని ప్రజా సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దింపుతామని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్నేళ్ల కాలంలో చేసిన అవినీతి,అక్రమాలు,ప్రశ్నిస్తున్న వ్యక్తుల పై అమలు చేస్తున్న నిర్భందాన్ని,నిరుద్యోగులకు జరిగిన మోసాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు.రెండు రోజుల్లో తమ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు విజయ్ ,రాజ్ కుమార్,విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు దుర్గ రాములు,శేఖర్,మహేష్,యుగెందర్,శివ,వెంకటేష్,ప్రణయ్,వెంకట్, అగస్టిన్,జనార్ధన్,కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.
