త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి గురువారం అగర్తలాలో బాధ్యతలు స్వీకరించారు.
త్రిపుర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు.
గవర్నర్ దంపతులను ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ, మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అగర్తలా విమానాశ్రమయంలో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తన నియామకంపై రాష్ట్రపతికి, ప్రధానికి, కేంద్ర హోమ్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రమాణ స్వీకారం అనంతరం రాజభవన్‌లో ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ, సీనియర్ అధికారులతో నల్లు ఇంద్రసేనా రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ వివరించారు.
అనంతరం నల్లు ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ అధికారులు పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని, సాధారణ పౌరులు సైతం సాధికారత సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా అనేకమంది ప్రజా ప్రతినిధులు, నాయకులు గవర్నర్‌కు అభినందనలు తెలిపారు.
