నేడు అల్పాహార పథకం ప్రారంభించనున్న: మంత్రి హరీష్ రావు
హైదరాబాద్:అక్టోబర్ 06
రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం టిఫిన్ అందించే ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం ఈ పథకాన్ని కేసీఆర్ ప్రారంభించాలని మొదట నిర్ణయించారు. కానీ అనివార్య కారణాల వల్ల సీఎం ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. దాంతో రావిర్యాల పాఠశాలలో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు అల్పాహార పథకాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాక మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం ప్రతీ నియోజకవర్గంలో ఒక్క పాఠశాలలో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దసరా సెలవుల తర్వాత అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందు అల్పాహారం అందించనున్నారు.
ఈ పథకం అమలు తీరును పర్యవేక్షించే బాధ్యతను పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ కమిషనర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించినట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 27,147 పాఠశాలల్లోని దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది. ఇందుకు సంబంధించి మెనూను అధికారులు ఖరారు చేశారు.
