అక్టోబర్ 03 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో మహాత్మ ఫూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలంటూ మంచిర్యాల జిల్లా బీసీ ఐక్యవేదిక నాయకులు మంచిర్యాల జిల్లా కలెక్టరుకు విన్నవించారు.
ఈ మేరకు మంగళవారం రోజున మంచిర్యాల కలెక్టరేటులో పరిపాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తాలో మహాత్మ ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో మంచిర్యాల ప్రజలు గత 15 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారని వారు పేర్కొన్నారు.
జిల్లా ప్రజల డిమాండ్ ని పక్కన పెట్టడం సమంజసం కాదని వారు తెలిపారు. బడుగు వర్గాల విద్య కోసం 150 ఏళ్ల క్రితం మహాత్మ ఫూలే ఉద్యమించి ఉండకపోతే నేడు మెజారిటీ వర్గాల ప్రజలు చదువు నేర్చుకోవడం, ఉన్నత పదవులు పొందడం సాధ్యమయ్యేది కాదని వారు తెలిపారు. బెల్లంపల్లి చౌరస్తాలో వేరే విగ్రహాలు పెడితే మంచిర్యాల ప్రజల అభీష్టానికి వ్యతిరేకమే అవుతుందని తెలిపారు.
మహాత్మ జ్యోతిరావు ఫూలేను సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు గౌరవిస్తారని వారు తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. మహాత్మా ఫూలే విగ్రహాన్ని ప్రతిష్టించడంతో పాటు ఆ ప్రాంతాన్ని ఫూలే చౌరస్తాగా నామకరణం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదికకన్వీనర్ ఒడ్డెపల్లి మనోహర్, సీనియర్ నాయకులు కనుకుంట్ల మల్లయ్య, సింగరేణి బీసీ సంఘర్షణ సమితి నాయకులు పెద్దపల్లి కోటిలింగం, సమ్ము రాజన్న, మాడిశెట్టి విశ్వం ఇతర నాయకులు పాల్గొన్నారు.






