
సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 11 (TS24/7 తెలుగు న్యూస్): మండలంలో 2018 డిసెంబర్ 11 తేదీ నాటికి బ్యాంకులో పంట రుణం తీసుకొని చెల్లించని రైతులకు రుణమాఫీ డబ్బులు జమవుతున్నాయని ఇప్పటివరకు మండలంలో 2826 మంది రైతులకు రూ. 13 కోట్లు రుణమాఫీ డబ్బులు జమ అయ్యాయని మండల వ్యవసాయ అధికారి యు వసంతరావు తెలియజేశారు. ఇంకా రోజువారి డబ్బులు జమవుతున్నాయని తెలిపారు. ఈ రుణమాఫీ అయిన రైతులు తమకు సంబంధించిన బ్యాంకులకు వెళ్లి మరల పంట రుణాలు పొందవచ్చని తెలియజేశారు. దీనికోసం రోజువారీగా గ్రామాల వారీగా తేదీలను ఖరారు చేసి బ్యాంకులకు మరియు రైతులకు వ్యవసాయ విస్తీర్ణ అధికారుల ద్వారా తెలియజేయడం జరిగిందని తెలిపారు. కాబట్టి రుణమాఫీ పొందిన రైతులు తమ బ్యాంకులకు కేటాయించిన తేదీలకు వెళ్లి కొత్త పంట రుణాలు పొందాలని తెలిపారు. ఈరోజు మండలంలోని SBI, APGVB మరియు DCCB బ్యాంకులకు వెళ్లి రుణమాఫీ పొంది కొత్తగా పంట రుణాలు మంజూరు గురించి ఆయా శాఖలు బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడారు. ఇప్పటివరకు 1500 మంది రుణమాఫీ అయిన రైతులు కొత్త పంట రుణాలు తీసుకున్నారని తెలిపారు. మండలంలో మిగిలిన రుణమాఫీ పొందిన రైతులు కూడా కొత్త పంట రుణాలను పొందాలని కోరారు. ఆయన వెంట వ్యవసాయ విస్తీర్ణ అధికారి మహమ్మద్ ఖలీల్ ఉన్నారు.




