దౌల్తాబాద్ : పాకలో కట్టేసిన కాడెద్దు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ముత్యంపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ముత్యంపేటకు చెందిన జెర్ర రాజయ్య ప్రతిరోజు మాదిరిగానే సోమవారం రాత్రి తన పొలం వద్ద ఉన్న పశువుల పాకలో కాడెద్దులను కట్టేసి మేతను వేసి ఇంటికి వెళ్ళాడు. మంగళవారం ఉదయం పశువుల పేడ తీసేందుకు పశువుల పాక వద్దకు వెళ్లే సరికి ఓ ఎద్దు మృతి చెంది ఉంది. ఎద్దు మృతికి కారణాలు తెలియలేదు. పిడుగు పాటుకు ఎద్దు మృతి చెంది ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనతో సుమారు డెబ్బై వేల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు.




