-యజమానులు జాగ్రత్తలు పాటించాలి
-తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి
తిమ్మాపూర్ మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హాస్టల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి నిత్యం పని చేసేలా చూడాలని తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి,ఎస్సై ప్రమోద్ రెడ్డి సూచించారు.గురువారం ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో మండలంలోని హాస్టల్లో యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు సలహాలు అందించారు. ఈసందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ హాస్టల్లో ఉండే విద్యార్థులు బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే పంపించాలని,రాత్రి వేళల్లో విద్యార్థులను బయటకు పంపించవద్దని సూచించారు.హాస్టల్ పిల్లల వద్దకు ఎవరైనా వస్తే తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని తెలిపారు. విద్యార్థులు,వారి తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు,పూర్తి వివరాలు హాస్టల్ యజమానుల వద్ద ఉండాలని సూచించారు. హాస్టల్లో
పరిశుభ్రతను పాటించాలని తెలిపారు. పోలీసులు త్వరలోనే హాస్టలను తనిఖీ చేయడం జరుగుతుందని,ఆ సమయంలో
సీసీ కెమెరాలు లేకుంటే తగు చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.ఈ సమావేశంలో ఎస్సై ప్రమోద్ రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది,హాస్టల్ యజమానులు పాల్గొన్నారు.