Breaking News

రేపే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల?

93 Views

*రేపే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల?*

హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రిలీజ్‌కు ప్రాథమిక సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ రిలీజ్ చేయడం ఆనవాయితీ. ఇప్పటివరకూ అదే జరిగింది. కానీ గతేడాది దసరా సందర్భంగా పార్టీని జాతీయ స్థాయికి విస్తరింపచేసే ఆలోచనతో బీఆర్ఎస్‌గా నామకరణం చేయడంతో కేసీఆర్ జాతీయ అధ్యక్షుడయ్యారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కేటీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.

శ్రావణ మాసం వచ్చేయడంతో ఈ నెల 18న విడుదల చేయించేలా ముహూర్తం ఖరారవుతున్నది. అన్నీ అనుకూలిస్తే తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఆ జాబితాను విడుదల చేస్తారు. ఈ కారణంగానే కేటీఆర్ అమెరికా పర్యటనను కూడా వాయిదా వేసుకున్నట్లు ఆయన సన్నిహితుల సమాచారం.

ముందుగా అనుకున్న ప్రకారం కేటీఆర్ గురువారం అమెరికాకు వెళ్లాల్సి ఉన్నది. కుమారుడిని గ్రాడ్యుయేషన్ కోర్సులో చేర్పించడానికి ఫ్యామిలీతో కలిసి వెళ్లాలనుకున్నారు. కానీ ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసే ప్రోగ్రామ్ ఉండడంతో ఆయన చేతులమీదుగానే ఈ వ్యవహారాన్ని నడిపించాలని కేసీఆర్ భావించినందున అమెరికా టూర్‌‌ను వాయిదా వేయించినట్లు తెలిసింది.

ప్రస్తుతం ఆయన రాష్ట్ర పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నా అన్నీ తానై వ్యవహరిస్తుండడంతో అప్రకటితంగా రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలను చూసుకుంటున్నారు. బీఆర్ఎస్‌ను ఇప్పటికే ఒక జాతీయ పార్టీగా ఆ పార్టీ నేతలు భావిస్తుండడంతో కేసీఆర్ జాతీయ అధ్యక్షుడనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఫస్ట్ లిస్టును ఈ నెల 18న విడుదల చేయడంలో ఏదేని పరిస్థితుల్లో చివరి నిమిషంలో సవరణలు, మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చి వాయిదా పడాల్సిన అవసరం ఏర్పడితే ఈ నెల 24న ఆ కార్యక్రమం ఉండొచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాతనే కేటీఆర్ అమెరికాకు వెళ్లనున్నారు.

తొలి జాబితాను విడుదల చేయడంలో కేసీఆర్ లక్కీ నెంబర్‌గా ఉండే ‘6’ ప్రతిబింబించనున్నది. అందులో భాగంగానే తొలి జాబితాలో అభ్యర్థుల సంఖ్య 66 లేదా 87 లేదా 96 లేదా 105 చొప్పున ఉండొచ్చని సమాచారం.

ఇప్పటికే ఏయే నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది దాదాపుగా కొలిక్కి వచ్చింది.వివాదం లేని స్థానాలన్నీ ఫస్ట్ లిస్టులో చోటుచేసుకుంటాయి….

Oplus_131072
Oplus_131072
Pitla Swamy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *